ఏషియన్ గేమ్స్ రేసులో వైభవ్.. సూర్య, గిల్‌కు దక్కని చోటు!

  • ఏషియన్ గేమ్స్ కోసం 30 మందితో ప్రాథమిక జాబితా
  • విండీస్ సిరీస్ వల్ల రెండు వేర్వేరు జట్ల ఎంపిక
  • భవిష్యత్తు ప్రణాళికల్లో సూర్యకుమార్ యాదవ్‌కు నిరాశ
  • కెప్టెన్ రేసులో అయ్యర్, శాంసన్, తిలక్ వర్మ
ఆసియా క్రీడల్లో పతకమే లక్ష్యంగా భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. జపాన్‌లోని ఐచీ-నగోయాలో జరగనున్న ఈ పోటీల కోసం 30 మందితో కూడిన ప్రాథమిక జాబితాను ఐఓఏకు సమర్పించింది. ఈ లిస్ట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా.. స్టార్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌ల పేర్లు లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

ఒకేసారి రెండు సిరీస్‌లు
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. అదే సమయంలో సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్ స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్‌లు ఒకే సమయంలో వస్తుండటంతో బీసీసీఐ రెండు వేర్వేరు టీమ్‌లను బరిలోకి దించుతోంది. విండీస్ సిరీస్‌లో గిల్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉండటం వల్లే అతణ్ని ఏషియన్ గేమ్స్ లిస్ట్‌లో చేర్చలేదని తెలుస్తోంది.

సూర్యకుమార్‌పై వేటు?
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు ఈ లిస్ట్‌లో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే 2028 ఒలింపిక్స్, తదుపరి టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇకపై భవిష్యత్తు ప్రణాళికల్లో లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ లేదా తిలక్ వర్మలలో ఒకరు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.

బుమ్రాకు చోటు
ఈ ప్రాథమిక జాబితాలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరు ఉన్నప్పటికీ అతడు విండీస్ వన్డే సిరీస్‌కే ప్రాధాన్యం ఇవ్వనున్నాడు. గాయం నుంచి కోలుకుంటున్న హర్షిత్ రాణాతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. స్పిన్నర్లలో కుల్దీప్, అక్షర్, సుందర్, హర్ష్ దూబేలను ఎంపిక చేశారు. వీరిలో ఇద్దరు ఏషియన్ గేమ్స్‌కు వెళుతుండగా, మిగిలిన ఇద్దరు విండీస్ సిరీస్ ఆడనున్నారు. గతంలో పసిడి గెలిపించిన రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కింది.

30 మంది వీరే
యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, ఆయుష్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్, శివం దూబే, విప్రజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్.

Vaibhav Suryavanshi
Asian Games 2024
Indian Cricket
Suryakumar Yadav
Shubman Gill
BCCI
IOA
Indian Squad
Cricket Team
Jasprit Bumrah

More Telugu News